- హైదరాబాద్‌లో మిళితమైన ఇరానీ సంస్కృతి
- ‘మినార్‌జోన్‌బాన్’ పోలికతో ఉన్న చార్మినార్
- గోల్కొండ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి నేటికి 500 ఏళ్లు పూర్తి...
- కట్టడాలను 16.2.2018 నాడు సందర్శించాడు ఇరాన్ అధ్యక్షుడు హన్సన్ రోహానీ
‘ఇరానీ ఛాయ్, ఇరానీ హోటల్, ఇరానీ బిర్యానీ, ఇరానీ హలీం’... ఇలా నగర జీవితంలో ఇరానీ సంస్కృతి మిళితం. భాగ్యనగరం, ఇరాన్ బంధం ఈనాటిది కాదు. 177 ఏళ్లు హైదరాబాద్ రాజ్యాన్ని ఏలిన కులీకుతుబ్‌షా చక్రవర్తులు ఇరాన్ దేశం నుంచి వలసొచ్చినవారే. ఆ మాటకొస్తే హైదరాబాద్ నగర రూపకర్త ఓ ఇరానీ. కట్టడాలు, కళలు, సంస్కృతి, కట్టు, బొట్టు, తిండి అన్నింటిలోనూ ఇరుదేశాలకు సారూప్యత మెండు. గుర్రాల అమ్మకం పేరుతో ఈ నేలపై అడుగుపెట్టిన కులీకుతుబ్‌షాహీలు గోల్కొండ స్వతంత్య్ర రాజ్యాన్ని ప్రకటించి నేటికి సరిగ్గా 500ఏళ్లు. ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహానీ నేడు నగరాన్ని సందర్శించనున్న నేపథ్యంలో ఇరాన్, హైదరాబాద్‌ల అనుబంధంపై ప్రత్యేక కథనం.
హైదరాబాద్: భారత్ పర్యటనకు విచ్చేస్తున్న ఇరాన్ దేశాధ్యక్షుడు హస్సన్ రోహానీ దేశ రాజధానిలోగాక, నేరుగా హైదరాబాద్‌కి రావడం. మక్కా మసీదు, కులీకుతుబ్‌షాహీ సమాధులు, గోల్కొండకోట వంటి చారిత్రక కట్టడాలను తను సందర్శించాలనుకోవడం.. ఇరానీలు హైదరాబాద్‌ని అమితంగా ప్రేమిస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం మరేం ఉంటుంది. ఇరాన్, భాగ్యనగరం బంధం ఈనాటిది కాదు. సుమారు 500ఏళ్ల క్రితమే ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు, సత్సంబంధాలు మొదలయ్యాయి. అలా ఇరు రాజ్యాల మధ్య సంస్కృతి ఏకరూపత సంతరించుకుంది. భాగ్యనగర జీవన విధానంలో ఇరాన్ సంస్కృతి మిళితమైంది. ఇంకా చెప్పాలంటే తినే ‘హైదరాబాద్ బిర్యానీ’, ధరించే ‘షేర్వాణీ’, మాట్లాడే ‘దర్వాజా’ వంటికొన్ని పదాలు, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించే ‘సూఫీయిజం’ వంటివన్నీ ఇరాన్ సంస్కృతి నుంచి మనం సొంతం చేసుకున్నవే. అంతేకాదు, ఇరాన్‌లోని ‘మినార్‌జోన్‌బాన్’ పురాతన కట్టడం పోలికతో చార్మినార్‌ని నిర్మించారంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ తొలి రూపకర్త, ఆర్కిటెక్ట్ మీర్‌మోమిన్ ఇరానీయుడే.
అలా మొదలైంది..!
ఇరాన్‌లోని హమథాన్ ప్రాంతానికి చెందిన సుల్తాన్ కులీ బహ్మనీ సుల్తానుకు గుర్రాలు అమ్మే నిమి త్తం 1490లలో బీదర్‌కి వచ్చారు. అదే సమయంలో ఆ దేశంలోని ‘బ్లాక్ షీప్’, ‘వైట్ షీప్’ తెగల మధ్య జరిగిన యుద్ధంలో వైట్ షీప్‌కి చెందిన కులీకుతుబ్‌షాహీ కుటుంబీకులు ఓటమిపాలయ్యారు. దాంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బీదర్‌కి చేరిన కులీ బహ్మనీ రాజ్యంలో మొదట సుబేదార్‌గా చేరాడు. అదే సమయం లో తన చాకచక్యంతో పొరుగురాజ్యంతో జరిగిన ఓ యుద్ధంలో బహ్మనీ సుల్తాన్ మహబూబ్ షా ప్రాణాల్ని కాపాడాడు. అలా 1512లో కులీ తెలంగాణ గవర్నర్ హోదాను అలంకరించాడు. మహబూబ్ మరణానంతరం, కులీ 1518లో గోల్కొండ రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు.
ఇస్ఫహాన్ నగర స్పూర్తితో..!
భాగ్యనగరానికి ఇరాన్‌లోని ఇస్ఫహాన్ పట్టణానికి భౌగోళికంగా దగ్గర సారూప్యత కనపడుతుందంటారు చరిత్ర అధ్యయన కారులు. ఇస్ఫహాన్‌కి చెందిన ప్రముఖ ఆర్కిటెక్చర్ మీర్ మోమీన్ విద్యార్హతలు, మేధ గురించి తెలిసిన ఐదో చక్రవర్తి మహ్మద్ కులీకుతుబ్ తన కొలువులో ప్రధానమంత్రి గా నియమించారు. అదే సమయంలో కొత్త నగరాన్ని నిర్మించాలనుకుంటున్న కులీ అంతరంగా న్ని గమనించిన మీర్ మోమీన్ ఇస్ఫహాన్ పోలికతో హైదరాబాద్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. టైల్స్‌తో గోడలను నిర్మించడం, గోడలపై డిజైనింగ్ వంటివన్నీ ఇరాన్ కట్టడాల్లో అంతర్భాగం. అందుకే చార్మినార్, కుతుబ్‌షాహీ టూబ్స్, అష్రుఖానా, పలు ఆర్చీలు, మినార్లు వంటి కుతుబ్‌షాహీ కట్టడాల్లో ఇరాన్ నిర్మాణశైలి అంతర్భాగమై ఉంటుంది.
వేష, భాషలు కూడా..!
వజ్రాలు, ముత్యాలు, సిల్క్, కళంకారీ వస్త్రాలు ఇక్కడ నుంచి ఇరాన్ ఎగుమతి అయ్యేవి. అక్కడ నుంచి ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్ వంటివి దిగుమతి అయ్యేవి. ‘షేర్వాణీ’ ఇరాన్ సంస్కృతిలో భాగం అయితే, తెలంగాణ కళంకారీ ఇరాన్‌లో కలిసిపోయింది. ఇప్పటికీ ఇరానీలు కళంకారీ వస్త్రాలను ఉపయోగిస్తున్నారు కూడా. దక్కనీ ఉర్దూలోనూ, తెలంగాణ తెలుగులోనూ పర్షియన్ పదాలు కలిసిపోయాయి. ‘దర్వాజా’, ‘బంద్’, ‘ముష్కిల్’, ‘ముస్తాబు’ వంటివన్నీ పర్షియన్ పదాలేనని చారిత్రక అధ్యయనకారులు చెబుతున్నారు.
మన బిర్యానీ ఇరానీదే..!
హైదరాబాద్ ఆహార సంస్కృతిలో భాగమైన ధమ్ బిర్యానీ, హలీం, కుర్భానీకా మీఠాతోపాటు కబాబ్ వంటి పలు మాంసాహార వంటకాలు ఇరాన్ నుంచి వచ్చినవేనని చారిత్రక పరిశీలకులు చెబుతున్నారు. బిర్యానీ తయారీలో సుగంధద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటివాటిని ఉపయోగించడం ఇరాన్ నుంచి మనం నేర్చుకున్నామనడం అతిశయోక్తికాదు.
No comments:
Post a Comment