Sunday, 15 July 2018

KUTUB SHAHEES

  • గోల్కొండను 171 సంవత్సరాల పాటు కుతుబ్‌షాహీలు పాలించారు. అందులో 1518లో అధికారం చేపట్టిన మొదటి రాజు సుల్తాన్‌ కులీకుతుబ్‌షా కాగా, చివరి రాజు అబ్దుల్‌ హసన్‌ కుతుబ్‌షా. అతడినే తానీషా అని కూడా అంటారు. అతడు 1689లో అధికారం కోల్పోయాడు.
  • గోల్కొండ కోటకు రాజు కావాలన్న తపనతో ఉన్న సుల్తాన్‌ కులీ రెండో కుమారుడు జంషీద్‌ కులీ కుతుబ్‌షా తన తండ్రిని చంపేశాడు. అంతేగాకుండా అన్న ఇబ్రహీంపై దాడికి యత్నించగా ఇబ్రహీం కులీకుతుబ్‌షా మచిలీపట్నం పారిపోయి మల్కిబరాముడు అనే పేరుతో కొన్నాళ్లు ఉన్నాడని చరిత్రకారులు చెబుతారు. దీంతో జంషీద్‌ రెండో రాజుగా చలామణి అయ్యాడు. ఏడు సంవత్సరాలు అతడు పరిపాలించాడు. ఇక జంషీద్‌ తర్వాత అతడి కుమారుడు సుభాన్‌ కులీకుతుబ్‌షా ఏడేళ్ల వయసులోనే రాజుగా కొద్దిరోజులు మాత్రమే పాలించాడు. అనంతరం ఇబ్రహీం రాజు కావడంతో ఈ కోటకు వైభవం వచ్చింది. మచిలీపట్నంలో తెలుగు నేర్చుకోవడంతో పాటు సాహిత్యంపై పట్టురావడంతో ఇబ్రహీం హయాంలో గోల్కొండ కోటలో నాట్యం, కవి సమ్మేళనం తదితర కార్యక్రమాలు జరిగేవి.
  • నాల్గవ రాజైన మహ్మద్‌ కులీ కుతుబ్‌షా కాలంలోనే భాగ్యనగర నిర్మాణం ప్రారంభమైంది. భాగమతితో ప్రేమాయణం సాగించి భాగ్యనగరం నిర్మించాడని చెబుతారు. నగరంలో అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇబ్ర హీం మొదలు కొని ఇతడు కూడా హిందూ-ముస్లింల సమానత్వాన్ని పాటించేవాడని ప్రతీతి. ఆయన కోసమే నిర్మించింది పురానాపూల్‌ వంతెన.
  • కుతుబ్‌షాహీ రాజ వంశస్థులలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పేరు హయత్‌బక్షీ బేగం.. గోల్కొండ కోటను పరిపాలించిన ఐదవ రాజు సుల్తాన్‌ మహ్మద్‌కుతుబ్‌షా. అతడే నగరంలోని మక్కా మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. అతడికి కొడుకులు లేరు హయత్‌బక్షీ బేగం అనే కూతురు ఉండడంతో ఆమెకు పెళ్లి చేసి అల్లుడిగా వచ్చిన అబ్దుల్‌కుతుబ్‌షాను ఆరో రాజును చేశారు. అతడి మరణాంతరం వారి కుమారుడు అబ్దుల్‌హసన్‌ కుతుబ్‌షా(తానీషా) ఏడో రాజుగా రాజ్యపాలన చేపట్టాడు. హయత్‌ బక్షీ బేగం ఐదో రాజుకు కూతురుగా, ఆరో రాజుకు భార్యగా, ఏడో రాజుకు తల్లిగా సమర్థవంతమైన పాత్రలు పోషించింది. కుమారుడి పాలనలో ఆమె సలహాలు అమోఘమని చరిత్రకారులు చెబుతారు. అందుకే కుతుబ్‌షాహీ సమాధులలో ఏ రాణికీ లేని విధంగా ఆమె సమాధిపై భారీ టూంబ్‌ను నిర్మించారు.
  • తానీషా భక్త రామదాసును చెరసాలలో వేసిన సమయంలో రామలక్ష్మణులు మారువేషంలో వచ్చి తానీషాకు డబ్బులు కట్టిన గాధ తెలిసిందే. అయితే రామలక్ష్మణులు బంజారా దర్వాజ మార్గం నుంచి కోటలోపలికి వచ్చారని చరిత్రకారులు చెబుతారు. వారి రాకకు నిదర్శనంగా బంజారా దర్వాజా తలుపులను మార్చేశారట. సాధారణంగా పదునుగా ఉండే తలుపులు ముందు భాగంలో సాధారణ తలుపులు రెండో ద్వారం వద్ద ఉంటాయి. కాని ఇక్కడ బంజారా దర్వాజ వద్ద సాధారణంగా చేసిన తలుపులు ముందు పక్కన ఉండి పదునైన ఇనుప చువ్వలు కలిగిన తలుపులు రెండో ద్వారం వద్ద అమర్చి ఉన్నాయి. ఇలా రామలక్ష్మణుల రాక సందర్భంగా మార్చేశారని పూర్వికులు చెబుతారు. వీటిని ఇప్పుడు బంజారా దర్వాజ వద్ద చూడవచ్చు.
  • కుతుబ్‌షాహీలు కాని, ప్రజలు కాని ఎవరైనా మక్కా పుణ్యక్షేత్రం వెళ్లాలన్నా. గోల్కొండ కోటకు గల మక్కాయి దర్వాజ నుంచే పంపేవారట. గోల్కొండ కోటకు తూర్పు నైరుతిలో ఉన్న ఈ దర్వాజకు మక్కాయిదర్వాజ అని కూడా పేరు పెట్టారట. ప్రస్తుతం ఈ దర్వాజ భారత ఆర్మీకి చెందిన ఆర్టిలరీ సెంటర్‌ వారి ఆధీనంలో ఉంది.
  • మొఘల్‌ సామ్రాజాన్ని విస్తరించి పేరు గడించిన ఔరంగజేబ్‌ దక్కన్‌ ప్రాంతంలోని గోల్కొండ రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు యుద్ధానికి వచ్చాడు. గోల్కొండ కోట ప్రహరీ(సఫిల్‌) పటిష్ఠంగా ఉండడంతో సాధ్యపడలేదు. దీంతో కోట పరిసర ప్రాంతంలోని శాతం చెరువు పక్కన ఓ గుట్టపై నుంచి గోల్కొండ కోటపైకి ఫిరంగి గుళ్లు కురిపించాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఔరంగజేబ్‌ సేన వెనుదిరిగింది. ఈ ఘటనతో తేరుకున్న గోల్కొండ రాజు కుతుబ్‌షాహీ మహ్మద్‌ అబ్దుల్‌ హసన్‌ తానీషా ఆ గుట్ట చుట్టూ సఫిల్‌ నిర్మించాడు. ఆ గుట్ట ప్రాంతంలో బురుజు నిర్మించి తానేషానే స్వయం గా ఫిరంగి ఏర్పాటు చేయించాడు. ఆ తర్వాత ఔరంగజేబు కిందిస్థాయివారికి లంచం ఆశ చూపి ఫతేదర్వాజ తలుపులు తెరిపించి లోపలికి ప్రవేశించి గోల్కొండ కోటను వశపరుచుకున్నాడని చరిత్ర చెబుతోంది.
  • ఔరంగజేబు 1689లో గోల్కొండ కోటను ఆక్రమించడంతో కోటపై ఏకధాటిగా 35 ఏళ్ల పాటు మొఘలుల జెండా ఎగిరింది. 1724 సంవత్సరం వరకు పాలించినట్టు చరిత్రకారులు విశ్లేషిస్తున్నారు.
కులీ కుతుబ్‌షాహీలది ఇరాన్‌ దేశం. కుతుబ్‌షాహీ రాజుల్లో మొదటి రాజు, ఆ సామ్రాజ్య వ్యవస్థాపకుడు అయిన సుల్తాన్‌ కులీ ఇరాన్‌ నుంచి ఢిల్లీకి వలసవచ్చాడు. అక్కడ తన మామ అల్లాకులీ, మరికొంతమందితో కలసి జీవించేవాడు. సుల్తాన్‌ కులీ తన స్నేహితులతో కలసి 16వ శతాబ్దంలో దక్షిణభారతదేశానికి వచ్చాడు. అప్పటికే గోల్కొండ కోటను పరిపాలిస్తున్న బహుమనీల వద్ద పనిలో చేరి బహుమని సుల్తాన్‌లకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత అదను చూసుకొని బహుమనీ రాజుల నుంచి సుల్తాన్‌ కులీకుతుబ్‌షా రాజ్యాన్ని బలవంతంగా చేజిక్కించుకుని 1518లో రాజుగా ప్రకటించుకుని కుతుబ్‌షాహీల పాలన మొదలు పెట్టాడు. అంటే 2018 సంవత్సరానికి సరిగ్గా ఐదు వందల ఏళ్లు అవుతుంది. సుల్తాన్‌కులీ రాజ్యాన్ని చేజిక్కించుకోవడంలో అతడి రెండో కొడుకు జంషీద్‌ కులీకుతుబ్‌షా సహకారం ఎంతగానో ఉంది. అతడి పెద్దకుమారుడు ఇబ్రహీం కులీకుతుబ్‌షా కూడా ఈ యుద్ధంలో పాల్గొన్నాడు.

No comments:

Post a Comment